వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ: ఏమిటి, ఎందుకు, ఎలా?

స్థానికీకరణ అంటే?

స్థానికీకరణ అంటే కంప్యూటర్ అనువర్తనాలను స్థానిక భాషలలోనికి (స్థానిక వాడుక, వ్యవహారాలకు తగ్గట్టు) అనువదించడం. స్థానికీకరించిన అనువర్తనం పూర్తిగా స్థానిక భాషలో ఉంటుంది. ఉదాహరణకు తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డు:

తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్టు తెరపట్టు
తెలుగు వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్టు తెరపట్టు

ఎందుకు?

తెలుగులో సినిమాలు ఉన్నాయి, వార్తాపత్రికలు ఉన్నాయి, టీవీ ఛానెళ్ళు ఉన్నాయి. అలాగే, కంప్యూటర్/మొబైలు అనువర్తనాలు కూడా తెలుగులో ఉంటే బాగుంటుంది కదా! మైక్రోసాఫ్ట్, ఆపిల్ వంటి సంస్థల ఉత్పాదనలు వారు తెలుగులో అందించే వరకూ ఎలాగూ వాడుకోలేము. కానీ స్వేచ్ఛా, ఓపెన్ సోర్సు ప్రాజెక్టులు వారి అనువర్తనాలను ఔత్సాహికుల సహాయంతో వివిధ భాషల్లో అందిస్తున్నాయి. ఎవరో ఏదో చేస్తారని ఎదురుచూసే బదులు, మనం ఈ ప్రాజెక్టుల స్థానికీకరణలో తోడ్పడితే వీటిని తెలుగువారందమూ తెలుగులో ఆనందించవచ్చు.

అంతర్జాలంలో ఇప్పుడు మూడోవంతు సైట్లు వర్డ్‌ప్రెస్ మీదే నడుస్తున్నాయి. ఇంత ప్రాముఖ్యమున్న వర్డ్‌ప్రెస్ తెలుగులో మాత్రం అందుబాటులో ఉండొద్దూ!? అందుకే ఔత్సాహికులం వర్డ్‌ప్రెస్‌ను తెలుగు లోనికి అనువదిస్తున్నాం. మీరు కూడా తోడ్పడవచ్చు.

ఎలా?

ఐదు చిన్న అంచెల్లో వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ చేసెయ్యవచ్చు.

  1. ముందుగా వర్డ్‌ప్రెస్.ఆర్గ్ సైటులో మీకు ఒక ఖాతా తెరుచుకోండి.
  2. తర్వాత అనువదించాల్సిన ప్రాజెక్టుల పేజీకి వెళ్ళండి. ప్రతీ ప్రాజెక్టుకు ఎదురుగా ఉన్న “Untranslated” వరుసలోని అంకెలపై నొక్కి అనువాదాలు మొదలుపెట్టవచ్చు. (బొమ్మలో చూడండి.)
    స్థానికీకరించాల్సిన వర్డ్‌ప్రెస్ ప్రాజెక్టులు
  3. అనువదించే పేజీలో, మీరు అనువదించాలి అనుకున్న పదబంధంపై (లేదా ఆ లైనులో ఎక్కడైనా, బొమ్మలో పసుపు రంగులో చూపినచోట ) రెండు నొక్కులు నొక్కండి.
    అనువదించాల్సిన పదబంధాలు
  4. పదబంధాన్ని రెండు నొక్కులు నొక్కిన తర్వాత, మీరు అనువాదం చేర్చడానికి పేటిక తెరుచుకుంటుంది. దానిలో మీ అనువాదం టైపు చేసి “Add translation →” అన్న బొత్తం నొక్కడమే! (బొమ్మ చూడండి.)అనువదించే చోటు

అంతే! మీరు వర్డ్‌ప్రెస్‌కు తొలి అనువాదం చేసినట్టే! అలానే మిగతా పదబంధాలకు కూడా మీ అనువాదాలు చేర్చండి. అనువాదం చేయడంలో వచ్చే సందేహాలకు, అనువాద నాణ్యత కోసం ఈ క్రింది వనరులను సంప్రదించండి.

వర్డ్‌ప్రెస్‌ను తెలుగీకరించడంలో మరేమైనా సందేహాలుంటే ఈ సైటులో అడగండి. వర్డ్‌ప్రెస్ స్థానికీకరణ ప్రక్రియ గురించి పూర్తి అవగాహన కొరకు వర్డ్‌ప్రెస్ అనువాదకుల హ్యాండ్‌బుక్ కూడా చూడండి.

#how-to, #l10n